పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. మాజీ మంత్రి కుమార్తె ఉద్యోగం ఊస్ట్

  • పీడీఎస్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ కుమార్తెపై వేటు
  • బెంగాల్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పదవి నుంచి ప్రియదర్శిని మల్లిక్ తొలగింపు
  • రాజీనామా చేయాలన్న సూచనను నిరాకరించడంతో ప్రభుత్వం చర్యలు
  • గతంలో ప్రియదర్శిని భారీ ఆదాయంపై కూడా ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన రేషన్ పంపిణీ (పీడీఎస్) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ కుమార్తె ప్రియదర్శిని మల్లిక్‌పై ప్రభుత్వం వేటు వేసింది. పశ్చిమ బెంగాల్ ఉన్నత విద్యామండలి (WBCHSE) కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాశాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రియదర్శినిని రాజీనామా చేయమని ఉన్నతాధికారులు సూచించారు. గత తృణమూల్ ప్రభుత్వంలో వెలుగుచూసిన స్కూల్ ఉద్యోగాల కుంభకోణం నేపథ్యంలో శాఖలో మార్పులు చేస్తున్నారు. అయితే, రాజీనామాకు ఆమె నిరాకరించడంతో ప్రభుత్వం ఆమెను పదవి నుంచి తొలగించింది. తిరిగి తన పాత ఉద్యోగమైన కోల్‌కతాలోని అసుతోష్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాలని సూచించింది.

గతంలో ఆహార, సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జ్యోతిప్రియ మల్లిక్ పీడీఎస్ స్కాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 2023లో ఆయనను అరెస్ట్ చేశారు. సుమారు ఏడాది జైల్లో ఉన్న ఆయన, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గతంలో ఈడీ విచారణలో ప్రియదర్శిని పేరు కూడా తెరపైకి వచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ ట్యూషన్ల ద్వారా ఆమె రూ. 3.37 కోట్లు ఎలా సంపాదించారనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. విద్యామండలి కార్యదర్శి పదవికి ఆమె అనుభవంపై ప్రతిపక్షాలు కూడా సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ తాజా పరిణామంపై తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.  

Jyotipriya Mallick
West Bengal
PDS scam
Priyadarshini Mallick
WBCHSE
ration distribution scam
Trinamool Congress
ED investigation
school jobs scam
corruption

More Telugu News